మరోసారి పెద్ద మనసు చాటుకున్న సుందర్ పిచాయ్

న్యూఢిల్లీ : కరోనా సంక్షోభంలో భారతీయులను ఆదుకునేందుకు  ఆల్ఫాబెట్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్  మరోసారి తన పెద్ద మనసు  చాటుకున్నారు.  గివ్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థకు  భారీ విరాళాన్ని ప్రకటించారు. రూ .5 కోట్లు విరాళంగా ఇవ్వనున్నారు.  భారతదేశంలో  కోవిడ్ -19, లాక్‌డౌన్‌ ఇబ్బందుల్లో ఉన్నా రోజువారీ వేతన కార్మికుల కుటుంబాలకు నగదు సహాయం అందించడానికి  రూ.5 కోట్ల నిధులను  అందించనుంది.  ఈ సందర్భంగా గివ్ ఇండియా ట్విటర్ ద్వారా సుందర్ పిచాయ్‌కు కృతజ్ఞతలు తెలిపింది. 




కరోనా వైరస్ పోరులో భాగంగా ప్రపంచ ఆరోగ్య సంస్థతోపాటు, ప్రపంచవ్యాప్తంగా 100 ప్రభుత్వ సంస్థలకు గూగుల్ 800 మిలియన్ డాలర్ల సాయాన్నిప్రకటించింది. అలాగే చిన్న వ్యాపారాలకు మూలధనాన్ని అందించే ప్రయత్నాల్లో భాగంగా స్వచ్ఛంద సంస్థలు, బ్యాంకులకు 200 మిలియన్ల  డాలర్లను పెట్టుబడులను ప్రకటించింది. అంతేకాకుండా వాస్తవాల నిర్ధారణ, తప్పుడు సమాచారంపై లాభాపేక్ష లేకుండా పోరాటం చేసేందుకు 6.5 మిలియన్‍ డాలర్లు (దాదాపు రూ.49 కోట్లు) తక్షణ సాయాన్ని అందిస్తున్నట్టు కూడా గూగుల్‍ ప్రకటించింది. భారత్‍తో పాటు ప్రపంచ మొత్తం ఈ సేవలు అందించనుంది. (కరోనా : రిలయన్స్ శాస్త్రవేత్తల ముందడుగు)