ముంబై : చైనాలోని వుహాన్ నగరంలో పురుడుపోసుకున్న ప్రమాదకర కరోనా వైరస్ (కోవిడ్-19) కొద్దికాలంలోనే ప్రపంచ దేశాలను చుట్టిముట్టింది. ఏ రంగాన్నీ వదలకుండా ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. ఆఖరికి క్రీడారంగంపై కూడా తన ప్రభావాన్ని చూపుతోంది. కరోనా కారణంగా ఇప్పటికే పలు టోర్నీలు రద్దు అయిన విషయం తెలిసిందే. మరోవైపు ప్రపంచమంతాఎంతో ఆసక్తికరంగా ఎదురుచూసే టోక్యో-2020 ఒలింపిక్స్ నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. తాజాగా కరోనా ప్రభావం ఐపీఎల్-2020ను సైతం తాకింది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా మెగా టోర్నీని నిర్వహించి తీరుతామని ఓవైపు బీసీసీఐ ముక్తకంఠంతో చెబుతుండగా.. వాస్తవ పరిస్థితులు మాత్రం దానికి భిన్నంగా ఉన్నాయి. కరోనా ఎఫెక్ట్‌తో పౌరుల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఐపీఎల్ టోర్నీని తాత్కాలికంగా వాయిదా వేయాలని కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు బీసీసీఐని కోరాయి. మరోవైపు ఐపీఎల్ నిర్వహణకు బీసీసీఐ అనుమతి నిరాకరించాలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో జి అలెక్స్ బెంజిగర్ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. (కరోనా భయం.. ఐపీఎల్ సాధ్యమేనా?)
ఐపీఎల్‌పై నీలినీడలు.. టికెట్లపై నిషేధం..!